న్యూయార్క్: అమెరికాలో స్థిరపడిన తెలుగువారు వివిధ రంగాల్లో రాణిస్తూనే, తాజాగా యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్ లోనూ ప్రవాస యువత (NRI Youth) దుమ్మురేపుతున్నారు. న్యూయార్క్ లో స్థిరపడిన ప్రముఖ ఫార్మసిస్ట్ లక్ష్మణ్ అనుగు పెద్ద కుమారుడు అమిత్ ఓ వైపు డాక్టర్ కోర్సు చదువుతూనే, మరోవైపు నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అమిత్, బిగ్‌బాస్ ఫేమ్ దివి వడ్త్యా జంటగా నటించిన సరికొత్త ఇండిపెండెంట్ లవ్ ట్రాక్ 'హలో అమ్మాయి' అమెరికా వేదికగా అత్యంత వైభవంగా విడుదలైంది.
TTA కన్వెన్షన్ వేదికగా గ్రాండ్ రిలీజ్
ఇద్దరు సోలో ట్రావెలర్స్ మధ్య అనుకోకుండా జరిగిన పరిచయం, ఆపై అది ప్రేమగా ఎలా మారింది అనే ఆసక్తికరమైన లైన్ తో ఈ యూత్ ఫుల్ సాంగ్ ను తెరకెక్కించారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) నార్త్ కరోలినాలోని ఛార్లెట్ లో నిర్వహిస్తున్న మెగా కన్వెన్షన్ వేదికపై ఈ పాటను పలువురు ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి తదితరులు ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు ఇండస్ట్రీకి మరో యువ హీరో: దిల్ రాజు
కన్వెన్షన్‌లోని బిగ్ స్క్రీన్ పై 'హలో అమ్మాయి' సాంగ్‌ను ప్రజెంట్ చేయగా అక్కడి ప్రేక్షకులనుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అమిత్ నటనలో మంచి ఈజ్ (Ease) ఉందని, డ్యాన్స్ బాగా చేశాడని కొనియాడారు. నటనలో అతడిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరింత బాగా రాణిస్తాడని, టాలీవుడ్ కు మరొక కొత్త హీరో దొరికినట్లేనని దిల్ రాజు ప్రశంసించారు. ప్రతిభ, కష్టపడే తత్వం ఉన్నవాళ్లను ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడూ ఆదరిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
యూట్యూబ్‌లో లవ్ ట్రాక్ హల్‌చల్
ఈ మ్యూజిక్ వీడియోలో నటించిన టాలీవుడ్ బ్యూటీ దివి సైతం ప్రత్యేకంగా అమెరికా వెళ్లి ఈ వేడుకలో పాల్గొన్నారు. అమిత్ తో తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని, ఈ పాటను ఆదరించి సక్సెస్ చేసిన ప్రవాస తెలుగువారందరికీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ ఈ సాంగ్‌కు కాన్సెప్ట్, కొరియోగ్రఫీ అందించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. లక్ష్మణ్ అనుగు నిర్మించిన ఈ యూత్ ఫుల్ సాంగ్ ను సురేష్ బనిసెట్టి రాయగా, అరుణ్ చిలివేరు సంగీతంలో సింగర్ దీపు ఆలపించారు. గోవాతో పాటు వికారాబాద్ లోని అందమైన లొకేషన్లలో షూట్ చేసిన ఈ సాంగ్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ మధుర ఆడియో ద్వారా ప్రస్తుతం యూట్యూబ్ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.


